Sunday, March 21, 2010

జయన్న కేఫెలో ఇంతిగాడి లవ్ స్టోరి . written by mahy.

మన RV తన బ్లాగ్ లో జయన్న కేఫ్ కథలు అని మొదలు పెట్టాడు.తాను రాసిన రెండు పోస్టింగ్స్ చదివాక నేను నా జ్ఞాపకాల దొంతెరను తీసి ఏకంగా తన బ్లాగ్ లో ఒక కథ రాసాను.అదే .........
                                         ఇంతిగాడి లవ్ స్టోరి         

కరెక్టగా నా డిగ్రీ అయిపోయి నేను మా బిజినెస్ చూసుకుంటున్న రోజులు కాళీగా ఉన్న సమయాన్ని ఎలా గడపాల అనే ఆలోచనలో మాకు దొరికిన ఏకైక అడ్డా మా జయన్న కేఫ్.మా టీ మాస్టారు,సుబ్బుగాడు,అక్బర్ గాడు,సూర్యగాడు,కే.సి.వి,డాలోడు... ఇలా చాలామందిలో నేను.. ఇంతిగాడు[ఇంతియాజ్] .
ఈ ఇంతిగాడు ఎవరనేగా మీ డౌట్.ఇంతిగాడు ఎవరంటే మా ఊరిలో ఉండే కాటన్ నవాబు రెండో కొడుకు.
అసలు ఇంతిగాడు స్కూల్లో నాకంటే ఒక సంవత్సరం పెద్ద.
అంటే వాళ్ళది సెయింట్ఆన్స్ స్కూల్,నాది కావలి పబ్లిక్ స్కూల్.
ఇంతిగాడు ప్రేమించేది మా స్కూల్లో చదివే సీనియర్ని.
ఆ అమ్మాయి సెయింట్ఆన్స్ స్కూల్ కి షిఫ్ట్ అయిన తరవాత ఇద్దరు ప్రేమలో పడ్డారు.
ఇది నేను ఏడవ క్లాసులో ఉన్నప్పుడు విన్న మాట.
                             
ఇలా నేను కేఫ్ లో గడిపే సమయంలో ఒకరోజు అక్బర్ గాడితో దమ్ము కొడుతున్నాను.
ఎవడో ఒకడు నల్ల జర్కిన్,బ్లూజీన్స్,రీబాక్ స్పోర్ట్స్ షూ వేసుకుని స్టైల్ గా వచ్చి మా పక్కన కూర్చున్నాడు.
ఇంకా స్టైల్ గా గోల్డ్ కింగ్ సిగరెట్ నోట్లో పెట్టుకుని వెలిగించుకున్నాడు.
ఇంతలో అక్బర్ గాడు పరిచయం చేసాడు ఇతనే ఇంతియాజ్ అని,హైదరాబాద్ లో జాబ్ సెర్చ్ లో ఉన్నాడని.
అప్పుడు వెలిగింది ఈ ఇంతిగాడే కదా ఆ రోజుల్లో మా సీనియర్ ని లవ్ చేసాడని.
 పరిచయం చేసాడో లేదో చాలా క్లోజ్ అయ్యాడు.
అప్పుడే అర్థమయ్యింది తను చాలా లైట్ గోయింగ్ అని,ఫ్రెండ్షిప్ కి ఎంతో విలువిస్తాడని.
అలా  మేము వారం రోజుల్లో క్లోజ్ అయ్యాం.తరవాత వాడు నాకు చెప్పిన నిజాన్ని విని చాలా షాక్ అయ్యా.అది ఏమిటనేగా,వాడు ఇంకా ఆ అమ్మాయినే లవ్ చేస్తున్నాడని.ఏడో తరగతిలో లవ్ చేసి ఇప్పుడు బి.టెక్ అయిన తరవాత కూడా వాళ్ళు ప్రేమించుకుంటున్నారని తెలిసి ఒకరకమైన షాక్.
ఇంతలో  లాలీపాప్ చీక్కుంటూ వచ్చాడు జగదీష్.జగదీష్,ఇంతి క్లోజ్ ఫ్రెండ్స్.జగదీష్ ఎవరంటే మా ఫ్రెండ్ రాకేష్ వాళ్ళ అన్న.

          ఇలా  మా ఫ్రెండ్షిప్ మూడు సిగరెట్లు ఆరు టీలుగా సాగింది.
అలాగే ఇంతి తన లవ్ స్టొరీ నాకు చెప్పాడు.నాకు చాలా థ్రిల్లింగా ఉండేది.
అన్ని లవ్ స్టోరీస్ లాగా ఈ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది.
ఇంకేముంది ఆ అమ్మాయిని చెన్నైలో ఉండే వాళ్ళ బంధువుల ఇంటికి పంపారు.
వీళ్ళ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్.ఇక చూడండి మన ఇంతి గాడి పరిస్థితి.దేవదాసై దిగులుగా గెడ్డం పెంచేసి దీనంగా ఉంటాడని అనుకుంటున్నారా?అదేం లేదు చాలా సరదాగా జోకులేసుకుంటూ చాలా లైట్ గా ఉన్నాడు.మళ్ళీ నాకు షాక్!!

అన్ని లవ్ స్టోరీస్ లాగ మన ఇంతి గాడి లవ్ స్టొరీకి ట్విస్ట్ రానే వచ్చింది.ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.
ఒక రోజు సాయంత్రం ఇంతిగాడు కేఫ్ కి వచ్చాడు.నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను,ఇక మేము లేచిపోవాలని అనుకుంటున్నాము అని చెప్పాడు.మళ్ళీ షాక్!

ఆ అమ్మాయి పినాకిని express లో చెన్నై నుంచి కావలికి వాళ్ళ ఆంటితో బయలుదేరింది.మన కేఫ్ నుండి అక్బర్ గాడు,శీనుగాడు,కే.సి.వి.ఇలా ఇంతి గ్యాంగ్ తో బయలుదేరాడు.నెల్లూరుకెళ్ళి పినాకిని  క్యాచ్ చేసారు.వీళ్ళంతా అమ్మాయి ఉండే కంపార్టుమెంట్ ఎక్కారు.ఇద్దరు చూసుకున్నారు.కళ్ళతో ఏదో కమ్యునికేట్ అయ్యారు.బ్యాచ్ అంతా టెన్షన్ గా ఉన్నారు.ఇంతిగాడి ప్లాన్ ఏమిటో ఎవరికీ తెలియదు.వాడు ఎవడికి చెప్పడు.కావలి రానే వచ్చింది.అందరికి టెన్షన్.అమ్మాయి పక్కన వాళ్ళ ఆంటి.ఇంతి ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు.స్టేషన్ వచ్చింది.ఆ అమ్మాయి వాళ్ళ ఆంటితో platform పైకి దిగింది.ఆ అమ్మాయి ఇంతి&కో ని అలా చూస్తూ వెళ్లిపోయింది.అంతలో ఇంతిగాడు అలా ఆ అమ్మాయి కూర్చున్న సీటు దగ్గరికి వెళ్లి తను విడిచిన బ్యాగ్ తీసుకుని platform మీదకి దిగాడు.
ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.అందరు నేరుగా జయన్న కేఫ్ కి వచ్చారు.అప్పుడే నేనూ కేఫ్ కి వచ్చా.అందరు ఇంతిగాడిని తిడుతున్నారు.ఏమైంది అని నేను అక్బర్ గాడిని అడిగా.జరిగిందంతా చెప్పాడు.ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది?అసలు వీడి స్కెచ్ ఏమిటి?
అమ్మాయికి సంబంధించిన సర్టిఫీకేట్స్,నెలకు సరిపడా బట్టలు.
ఇంతి రిజిస్టర్ మ్యారేజ్ కి అప్లై చేసాడు.ఏజ్ ప్రూఫ్ కి అమ్మాయి సర్టిఫికేట్స్ పెట్టాడు.అది వాడి ప్లాన్.అందుకే పినాకినిలో high drama క్రియేట్  చేసాడు.

ఒక రోజు ఇద్దరు జయన్న కేఫ్ లోని ఫ్రెండ్స్ హెల్ప్ తో రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ చేసుకుని,తన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని  హైదరాబాదుకు చేరారు.అంతకు ముందే ఇంతి లంగరుహౌస్ లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.ఈ విషయం మాకు ఎవరికీ చెప్పలేదు.వెళ్ళే ముందు నా దగ్గర కొంత మనీ తీసుకున్నాడు.అలానే తాను దాచిపెట్టుకున్న మనీ అంతా రెడీ చేసుకుని హైదరాబాద్ వెళ్లారు.ఒక నెల రోజులు హైదరాబాద్ లో ఇంటినుండి బయటికి రాకుండా ఆ ఇంట్లోనే గడిపారు.ఇంతి ఫోన్లు అన్ని స్విచ్ఆఫ్ చేసాడు. ఇక్కడ ఇంతి వాళ్ళ ఇంట్లో అంతా సీరియస్.అలాగే అమ్మాయి ఇంట్లో వాళ్ళు వీళ్ళ కోసం అన్ని చోట్ల తిరిగారు.

                       కేఫ్ లో అందరికి ఒకటే టెన్షన్.ఎందుకంటే అందరం ఇన్వాల్వ్ అయ్యున్నాం కదా లవ్ స్టోరీలో.ఇంతలో ఇంతి బెస్ట్ ఫ్రెండ్ జగదీష్ ని అమ్మాయి వాళ్ళ నాన్న ఇంటికి పిలిచి మాట్లాడాడు అన్న టాక్ వచ్చింది కేఫ్ లో.ఇక అంతే ఎవడికి వాడు నా పేరు చెప్పుంటాడని అందరు భయపడుతున్నారు.
తరవాత నేను జగదీష్ ని అడిగా మేటర్ ఏంటని.ఏమీ లేదు బెదిరించారు,నేను ఏమీచెప్పలేదు అన్నాడు.అయినా ప్రతీ ఒక్కడికి జగదీష్ మీద డౌట్.ఎందుకొచ్చిన తలనొప్పి అని కొందరు,ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అని కొందరు.అలా అలా గడిచిపోతున్నాయి రోజులు.
ఒక నెల రెండు నెలలు తరవాత ఇంతియాజ్ కేఫ్ లో కనిపించాడు.అంతా హ్యాపీ మామ,అందరు ఒప్పుకున్నారు,అంతా ఓకే అంటూ కింగ్ వెలిగించి రింగులు వదులుతూ చెప్పాడు.ఓకే నాకు హ్యాపీగా అనిపించింది.ఇంకేమిటి ఇంతి పార్టీ ఎప్పడు ఇస్తున్నావ్ అని అడిగా.నువ్వు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు అన్నాడు హుషారుగా.సరే నేను వెళ్తున్నా అని చెప్పి కేఫ్ నుంచి బయలుదేరాడు ఇంతి.అలా వెళ్ళడం,వెళ్ళడం ఇక ఇప్పటికీ కనపడలేదు.మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలిసాడు.అమ్మాయి పుట్టిందని చెప్పాడు.అలాగే U.K వెళ్లానని చెప్పాడు.అంతే.. తర్వాత నెమ్మదిగా మమ్మల్ని మర్చిపోయాడు..

                                        కేఫ్ లో అందరు ఇంతి అవసరం అయ్యాక వదిలేసాడని,కావాలనే మమ్మల్ని వాడుకున్నాడని ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు.కాని నాకు ఇంతి మీద ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ లేదు.మరి ఇన్ని రోజులు మమ్మల్ని ఎందుకు కలవలేదు?ఇంతికి ఫ్రెండ్ షిప్  వేల్యూ తెలియదా?మమ్మల్ని వాడుకున్నడా ?ఏమో ! ఇంతి మనసులో ఏముందో?
ఇంత మంది ఏమి ఆశించి ఇంతికి  హెల్ప్ చేసారు.దీనికంతా మా మద్య ఉన్న స్నేహమే కారణం..మరి ఆ స్నేహం పుట్టింది జయన్న కేఫ్ లో..
మమ్మల్ని మరచి దూరంగా ఉన్న ఇంతి ఈ కథ చదివి కలుసుకుంతాడనే ఆశతో...............మహి.

1 comment: